- హాస్టల్ సమస్యలు విని భావోద్వేగం.. ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి ఆగ్రహం
నాగర్‌కర్నూల్, వెలుగు: గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నప్పటికీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ, కల్వకుర్తి మండలాల్లో పర్యటించిన ఆయన గురుకులాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆశ్రమ స్కూళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
వెల్దండలోని ఏకలవ్య గురుకుల స్కూల్‌ను సందర్శించి స్టూడెంట్స్‌తో మాట్లాడారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను విని భావోద్వేగానికి గురయ్యారు. తాగునీటి ట్యాంకులు శుభ్రం చేయడం లేదని, సమస్యలు చెప్పిన స్టూడెంట్స్‌ను టార్గెట్ చేస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు. ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని చైర్మన్ హామీ ఇచ్చారు. వెల్దండలో రేషన్ షాప్, ఎస్సీ బాలికల ఆశ్రమ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని కూడా తనిఖీ చేశారు.
వంటగది, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంపై సిబ్బందిని మందలించారు. అనంతరం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న ఆహారాన్ని, కల్వకుర్తిలోని సివిల్ సప్లై స్టాక్ పాయింట్‌ను పరిశీలించారు. గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల, కస్తూర్బా స్కూళ్లను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీచర్ల మధ్య వర్గపోరుతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు.
ఇప్పటికైనా మార్పు రాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం కల్వకుర్తి తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ప్రతి గురుకుల, ఆశ్రమ స్కూల్లో ఫిర్యాదు పెట్టెలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ కమిషన్ మెంబర్ కొంతం గోవర్ధన్‌రెడ్డి, ఆర్డీవో జనార్దన్‌రెడ్డి, వివిధ మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.
